27.9 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

గడి స్థలాల రక్షణకు ప్రజావాణిలో వినతి

(బాలే అజయ్ – 9290277727)

కోరుట్ల, మే 18 (తెలంగాణ సామ్నా):
కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి స్థలాలను రక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని కోరుతూ అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో మరియు గడి స్థలాల విచారణ అధికారి జీవాకర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గడి స్థలాల్లో నకిలీ దస్తావేజుల ఆధారంగా అక్రమంగా మంజూరైన విఎల్టీలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లు పూర్తి మద్దతుతో చేసిన సంతకాల ప్రతులను కూడా ఆర్డీవోకు అందజేశారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అన్ని పార్టీల కౌన్సిలర్లు, అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్, మాజీ చైర్మన్లు మరియు పలువురు ప్రజాప్రతినిధులు అక్రమ విఎల్టీల రద్దుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని నాయకులు పేర్కొన్నారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ కోరుట్ల గడి బురుజులు, కోనేరు మరియు అనుబంధ స్థలాలు చాళుక్య–జైనుల కాలానికి చెందిన చారిత్రక వారసత్వ సంపద అని వివరించారు. ఈ ప్రజా ఆస్తులను కొంతమంది నకిలీ దస్తావేజులతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ H.No. 6-4-228 ఆధారంగా సుమారు 5,800 గజాల భూమిపై చట్ట విరుద్ధంగా విఎల్టీలు పొందారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ కమిషనర్‌తో లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని కూడా ఆరోపించారు.

ఈ అంశంపై ఇప్పటికే అఖిలపక్ష ప్రజాసంఘాలు, స్థానిక ప్రజలు పలుమార్లు నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారని తెలిపారు. ఇప్పుడు పూర్తి కౌన్సిల్ మద్దతుతో కూడిన సంతకాల ప్రతులను అధికారులకు అందజేయడం ద్వారా గడి స్థలాల పరిరక్షణపై ప్రజల ఐక్యత స్పష్టమైందన్నారు.

ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అక్రమ అనుమతులను రద్దు చేయాలని, ఇందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243Wతో పాటు తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్–2019 ప్రకారం చట్టపరమైన బలమైన ఆధారం ఉందని నాయకులు గుర్తు చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

అదే విధంగా గడి స్థలాల్లో కూరగాయల మార్కెట్, పార్కు, మైసమ్మ దేవాలయం అభివృద్ధి చేయాలని కోరారు. దసరా మహిషాసుర మర్దన, బతుకమ్మ, గణేష్ నిమజ్జనం, మొహరం వంటి సంప్రదాయ ఉత్సవాలు యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ పేట భాస్కర్, ఎం.డి. ముజాహిద్, చెన్న విశ్వనాథం, చింత భూమేశ్వర్, సుతారి రాములు, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, శనిగారపు రాజేష్ తదితర అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles