(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు అర్బన్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చేయూత పెన్షన్ లబ్ధిదారుల కోసం ముఖచిత్ర ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్లు గుగులోవత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 15 వరకు నెల రోజుల పాటు కొత్త ముఖచిత్ర ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు కోరుట్ల మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లేందుకు దూర ప్రయాణం చేయాల్సి రావడం, ఆటో చార్జీల భారం పడటం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డు ప్రజల సౌకర్యార్థం స్థానికంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్బన్ కాలనీలో మంగళవారం, బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ధృవీకరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం 7వ వార్డులోని కేఎస్ఆర్ కాలనీ, అయోధ్య నగర్, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, వృద్ధులు పాల్గొన్నారు.
