(బాలే అజయ్ – 9290277727)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సంజయ్, అనంతరం మెట్‌పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగురవేసి వైద్య సిబ్బంది, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అనేది అనేక మంది అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా సాధ్యమైందని అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కోరుట్ల నలంద హైస్కూల్‌లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
