
(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మల్లాపూర్ మండలంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వాల్గొండ, వాల్గొండ తండా, గొర్రెపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మరియు పలువురు నాయకులు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదేవిధంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో 85 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను జువ్వాడి నర్సింగ్ రావు అందజేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల 17 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట్, మల్లాపూర్ మండల కేంద్రం, పాత దామరాజ్‌పల్లి, వాల్గొండ, మొగిలిపేట గ్రామాల్లో నూతన మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
అలాగే కొత్త దామరాజ్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమాలలో పలు గ్రామాల సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
