
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల, జూన్ 12: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు కోరుట్ల మున్సిపాలిటీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర ఆదేశాల మేరకు పట్టణంలోని టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు మొత్తం రూ.10 వేల జరిమానా విధించారు.
తనిఖీల సందర్భంగా వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే ట్రేడ్ లైసెన్స్‌ను ఇంకా రెన్యువల్ చేయని దుకాణదారులు వెంటనే లైసెన్స్ పునరుద్ధరణ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వి. రాఘవేంద్ర మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేయాలని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులు వెంటనే లైసెన్స్ పొందాలని సూచించారు.
వ్యాపార సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలను తడి, పొడి, హానికర చెత్తగా వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్.డబ్ల్యూ.ఎమ్) నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, ఇన్‌చార్జి సానిటరీ ఇన్‌స్పెక్టర్ అశోక్, రికార్డు అసిస్టెంట్ జగదీష్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
