

చికెన్ సెంటర్ మరియు రెండు ఇళ్లలో చొరబడి విధ్వంసం
(బాలే అజయ్ – కోరుట్ల, 9290277727)
కోరుట్ల పట్టణంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని వినోబా రోడ్డులో గల సారధి చికెన్ సెంటర్ నిర్వాహకుడు బలరాం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరిస్తూ షాపు, రెండు ఇళ్లలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం 25 సంవత్సరాలుగా నడిపిస్తున్న మా షాపుని మూసివేయాలంటూ గత కొద్ది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. ఇదే వినోబా రోడ్డులో ఇంకా ఎన్నో చికెన్ సెంటర్లు మరియు మటన్ షాపులు ఉండగా మా ఒక్కరి షాపునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?”
అంటూ ప్రశ్నించగా, గురువారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య నలుగురు వ్యక్తులు వచ్చి “షాపు మూసేయాలి” అంటూ బెదిరింపులకు దిగారు. ముందుగా మూసివున్న చికెన్ సెంటర్ షట్టర్ నీ పగులగొట్టి లోపల ఫర్నిచర్, ఫ్రీజర్లు, ఇతర వస్తువులను దుండగులు ధ్వంసం చేసినట్టు బాధితురాలు చెబుతోంది. అనంతరం షాపు వెనుక ఉన్న ఇంటిలోకి చొరబడి ఇంటి సామాన్లను ధ్వంసం చేసినట్లు ఆమె తెలిపింది.
ఇంతటితో ఆగకుండా కొంత దూరంలో ఉన్న మరో ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ రాళ్లతో గేటు తాళాలు పగులగొట్టి, తరువాత ఇంటి తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులతో పాటు టీవీలు, ఫ్యాన్లు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా ధ్వంసం చేశారని బాధితులు వాపోయారు. రెండు ఇళ్లలోనూ వస్తువులను చెల్లాచెదురుగా పడేసి భయానక పరిస్థితి సృష్టించినట్లు బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.
