(బాలే అజయ్ – 9290277727)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం, ఆధునిక మౌలిక వసతులు, పరిశుభ్రమైన వసతి సౌకర్యాలను కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లింబాద్రితో కలిసి విద్యార్థులతో కూర్చొని అల్పాహారం చేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతి, తాగునీటి సౌకర్యం, తరగతి గదుల పరిస్థితి, బోధన విధానం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుపై పూర్తిగా దృష్టి సారించేలా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. xగురుకుల విద్యా సంస్థలను దేశంలోనే ఆదర్శ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత, భద్రత, నాణ్యమైన ఆహారం, మౌలిక వసతుల నిర్వహణతో పాటు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం అవసరమైన నిధులు, సౌకర్యాలను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తోందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జువ్వాడి నర్సింగరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
