(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని 28వ వార్డులో ఉన్న చారిత్రక కట్టడం ‘గడి గురుజుల’ వద్ద భారీ జాతీయ జెండా (హై మాస్ట్ నేషనల్ ఫ్లాగ్) ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ కొక్కెర వెంకటేష్ మున్సిపల్ అధికారులను కోరారు.
ఈ మేరకు సోమవారం ఆయన మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి చైర్‌పర్సన్ తిరుమల వసంత, వైస్ చైర్మన్ మహ్మద్ షాహిద్‌లకు వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో పట్టణ గౌరవార్థం ఒక ప్రదేశంలో అత్యంత ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఎజెండాలోని 20వ అంశంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన కౌన్సిలర్ వెంకటేష్, ఆ జెండాను ఏర్పాటు చేయడానికి గడి గురుజుల ప్రాంతం అత్యంత అనుకూలమైన ప్రదేశమని తెలిపారు.
గడి గురుజులు కోరుట్ల పట్టణానికి చారిత్రక గుర్తింపుగా నిలుస్తుందని, ఇప్పటికే ఈ కట్టడం జాతీయ జెండా రంగులతో అలంకరించబడిన నేపథ్యంలో అక్కడ హై మాస్ట్ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తే పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
అక్కడ జాతీయ జెండా ఏర్పాటు చేస్తే దేశభక్తి భావాలు మరింత పెంపొందడమే కాకుండా, పట్టణానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు.
