
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగు పడింది. ఆలయ అభివృద్ధి పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 3, శనివారం రోజున కొండగట్టుకు విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో హనుమాన్ దీక్ష స్వాముల కోసం ప్రత్యేకంగా దీక్ష విరమణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ మండపంలో ఒకేసారి సుమారు 2 వేల మంది భక్తులు నిర్విఘ్నంగా దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.
అదేవిధంగా భక్తుల వసతి సదుపాయాల మెరుగుదల కోసం 96 గదులతో కూడిన సత్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులకు కలిపి రూ.35.19 కోట్ల నిధులను టీటీడీ మంజూరు చేసిందని, దీనికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక చొరవే కారణమని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వెల్లడించారు.
ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. గతంలో కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాను విద్యుత్ వైర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ఘటనను గుర్తు చేసుకుంటూ, అది కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షమేనని తెలిపారు. హనుమాన్ దీక్ష స్వాములు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడమే ఈ అభివృద్ధి పనుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే కొండగట్టు గిరి ప్రదక్షణ చేయడానికి సరియైన మార్గాన్ని భక్తులకు కల్పించాలని అధికారులను కోరారు.
కొత్తగా నిర్మించనున్న వసతి సముదాయం ద్వారా తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు తగిన వసతి లభించనుంది. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా, టీటీడీ నిధుల మద్దతుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు కొండగట్టును దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా కీలకంగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కొండగట్టు ఆంజనేయస్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

