(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘురాములకోట, తిమ్మాపూర్ మండలం, జగిత్యాల మండలానికి చెందిన కట్లకుంట భూమారెడ్డి మరియు ఆయన భార్య కట్లకుంట లక్ష్మి తమ మోటార్ సైకిల్‌పై కుమార్తె గ్రామమైన వల్లంపల్లికి వెళ్లి, తిరిగి రఘురాములకోటకు వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుమారు 4:40 గంటల సమయంలో మోహన్‌రావుపేట గ్రామ శివారులోని మూలమలకల వద్దకు చేరుకోగానే, కరీంనగర్–2 డిపోకు చెందిన TS02T1770 నంబర్ గల ఎలక్ట్రిక్ బస్సును దాని డ్రైవర్ శ్రీరామోజు సంతోష్, గుండె గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా నివాసి, అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వచ్చి మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మోటార్ సైకిల్‌తో సహా కిందపడగా, భూమారెడ్డికి తలకు మరియు కుడికాలుకు తీవ్ర రక్తగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆయన భార్య లక్ష్మికి తల, కాళ్లు, భుజాలపై తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుడి కుమార్తె కొప్పెల అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
