తెలంగాణ సామ్నా బ్యూరో: హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది అనే ప్రచారం ఎంత వాస్తవమో, అదే హైదరాబాద్ విశ్వనేర నగరంగా మారుతున్నది కూడా అంతే నిజమనే వాదన వస్తున్నది. జేబుదొంగతనాలు మొదలుకొని, సైబర్ నేరాల స్థాయి దాటింది. తాజాగా వ్యభిచార నేరానికి సంబంధించిన సరికొత్త ఆంశాన్ని హైదరాబాద్ పోలీసులు చేధించారు. మయన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా జరుగుతున్న మానవ రవాణా భారతదేశానికి చిక్కులు తెచ్చిపెట్టడం అనేది పాత ఆంశమే. కాని తాజాగా పోలీసులు చేధించిన ఈ కేసులో రోహింగ్యా మహిళలు అక్రమంగా కలకత్తా మీదుగా హైదరాబాద్ వచ్చి వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది.
మయన్మార్ నుండి వయా కలకత్తా వచ్చి అక్కడ వున్న తాత్కాలిక షెల్టర్లలో వుండి దొంగ ఆధార్‌కార్డులు, నివాస దృవీకరణ పత్రాలు సంపాదించుకొని హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. పురుషులు అయితే వివిధ రంగాలలో పనికి కుదురుకుంటున్నారు. మహిళలు అయితే వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారు హైదరాబాద్‌లోని పాతబస్తీ సమీపంలో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు.
రోహింగ్యా యువతులు చేస్తున్న అనైతిక పనులపై దక్షిణ మండల పోలీసులకు సమాచారం అందడంతో వారు పకడ్బంది ప్రణాళికతో 18 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ధ వున్న నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బర్మానుండి భారతదేశానికి వచ్చిన అందరిని అరెస్ట్ చేసి వారి స్వదేశాలకు పంపించాలన్న డిమాండ్ ఎప్పటినుండో వున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా వ్యభిచార వృత్తిలోకి రోహింగ్య యువతులను దింపడం అనేది చర్చనీయాంశం అయ్యింది.
