28.1 C
Hyderabad
Tuesday, September 15, 2026
No menu items!

మంత్రి పొంగులేటి పర్యటన.. కోరుట్లలో జనసేన నేతల ముందస్తు అరెస్టులు

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

ముట్టడికి సిద్ధమవుతున్నారన్న సమాచారంతో పోలీసుల చర్యలు.., పర్యటన ముగిసే వరకు స్టేషన్‌లోనే.., జనసేన తీవ్ర ఖండన

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో కోరుట్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి పర్యటన సందర్భంగా జనసేన నాయకులు ఆయనను ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కోరుట్ల పట్టణానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని అనంతరం తన పర్యటన కొనసాగించారు. అయితే మంత్రి కోరుట్ల పట్టణంలో ఉన్న సమయంలో ఎలాంటి నిరసనలకు అవకాశం లేకుండా జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మంత్రి పట్టణం దాటి వెళ్లిన అనంతరం వారిని విడుదల చేశారు.

ప్రభుత్వం, మంత్రులను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసి ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

మంత్రుల పర్యటనల సందర్భంగా జనసేన నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించబోమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వారిలో జనసేన నాయకుడు మాసం విజయ్ రాజశేఖర్‌తో పాటు పలువురు జనసేన కార్యకర్తలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పొంగులేటి కోరుట్ల పట్టణం దాటి వెళ్లిన అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles