(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కోరుట్ల వెటర్నరీ కళాశాల పరిధిలోని “వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్” (VCC) లో సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనోటిక్ (Zoonotic) వ్యాధులు అనేవి జంతువుల నుంచి మనుషులకు, కొన్ని సందర్భాల్లో మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే అంటువ్యాధులని వివరించారు.1885 జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ పిచ్చికుక్క కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి తాను అభివృద్ధి చేసిన తొలి యాంటీ రేబీస్ టీకాను విజయవంతంగా అందించారని తెలిపారు. ఆ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు.రేబీస్ వంటి జూనోటిక్ వ్యాధులను నివారించాలంటే పెంపుడు జంతువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం అత్యంత అవసరమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఇన్‌చార్జి డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ దినోత్సవానికి ఒక ప్రత్యేక అంశాన్ని (థీమ్) ప్రకటిస్తుందని వివరించారు.
