ప్రజావాణిలో 22 ఫిర్యాదులు స్వీకరణ
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 22 ఫిర్యాదులు, వినతిపత్రాలను అధికారులు స్వీకరించారు. కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎల్. జీవాకర్ రెడ్డి డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, డివిజన్ కేంద్రంతో పాటు పరిధిలోని వివిధ మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి హాజరయ్యారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు తమకు అందిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో మొత్తం 22 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 10, మున్సిపల్ శాఖకు 3, పంచాయతీరాజ్ శాఖకు 2, వ్యవసాయ శాఖకు 1, ఆబ్కారీ శాఖకు 1, విద్యా శాఖకు 1, పోలీసు శాఖకు 1, వైద్య ఆరోగ్య శాఖకు 1, డీఎం ఆర్టీసీకి 1, మహిళా శిశు సంక్షేమ శాఖకు 1 ఫిర్యాదు చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. అందిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆర్డీఓ ఆదేశించారు.
ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కోరుట్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ (పీఆర్) ఎ. ధనలక్ష్మి, డీఈఈ (పీఆర్) ఎం. సత్యనారాయణ, కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఏఈ (హౌసింగ్) మాధురి శ్రీతో పాటు వివిధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
