
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల, మున్సిపల్ కమీషనర్ రవీందర్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని కిరాణా దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, చికెన్ సెంటర్లను పరిశీలించి నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించిన వ్యాపారులపై ఒక్కొక్కరికి రూ.5,000/- చొప్పున జరిమానాలు విధించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బట్ట సంచుల వినియోగంపై అవగాహన కల్పించారు.
అలాగే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయని దుకాణదారులపై చర్యలు తీసుకొని, వెంటనే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించి రూ.4,128/- ఫీజు వసూలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ రవీందర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులు వెంటనే లైసెన్స్ పొందాలని సూచించారు.
వ్యాపార కార్యకలాపాల ద్వారా వెలువడే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి, షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అప్పగించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై SWM–2019 చట్టం ప్రకారం జరిమానాలు విధించబడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, జవాన్లు రమేష్, రాజేష్, చంద్రప్రకాష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
