
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని పలు ద్విచక్ర వాహనాల షోరూంలలో జిల్లా రవాణాశాఖ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని మొహమ్మద్ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి.హెచ్. రామారావు, ఎం. సాయి చరణ్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా కొన్ని షోరూంలు తాత్కాలిక (టీఆర్) రిజిస్ట్రేషన్ లేకుండానే ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన షోరూం యాజమాన్యాలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వాహనాల విక్రయంలో రవాణాశాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత షోరూం యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
