
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన బ్రుహన్ముంబై మహానగర పాలిక సంస్థ (బి.ఎమ్.సి) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయాన్ని సాధించింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా, మొత్తం 227 కార్పొరేటర్ స్థానాలకు గాను మేజిక్ ఫిగర్‌ను దాటి 120 సీట్లను కైవసం చేసుకొని అధికారానికి దూసుకెళ్లింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో ఘన విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కూటమిలోని మిత్రపక్షం శివసేన (షిండే వర్గం) 27 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ముంబై మున్సిపల్ పాలనపై మహాయుతి కూటమి ఆధిపత్యం స్పష్టమైంది.
మరోవైపు, గత మూడు దశాబ్దాలుగా ముంబైపై ఏకచక్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబానికి ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదురైంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగినప్పటికీ, ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు.
శివసేన “ఉద్వాజ్ బాలాసాబ్ ఠాక్రే” (యూబీటీ) నేతృత్వంలోని కూటమి మొత్తం 73 సీట్లకే పరిమితమైంది. ఇందులో శివసేన (యూబీటీ) 63, “మహారాష్ట్ర నవనిర్మాణ సేన” (ఎంఎన్‌ఎస్) 10 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
అంతేకాకుండా, శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలుగా విడిపోయిన జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక ఖాతా కూడా తెరవడంలో విఫలమైంది.
మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారడమే కాకుండా, ముంబై రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేశాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
