(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
తడి, పొడి, శానిటరీ, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా విభజించాలని ప్రజలకు అవగాహన:
పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెత్త విభజనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత, చెత్త నిర్వహణ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డును ‘జీరో వేస్ట్ వార్డు’గా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆదివారం మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర, స్థానిక వార్డు కౌన్సిలర్‌తో కలిసి 33వ వార్డులో వీధివీధినా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి, ఇంటి వద్దనే చెత్తను వేర్వేరు రకాలుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సందర్భంగా తడి చెత్తలో వంటగది వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం, పండ్ల తొక్కలు,
పొడి చెత్తలో ప్లాస్టిక్, కాగితాలు, గాజు, డబ్బాలు,
శానిటరీ చెత్తలో ఉపయోగించిన శానిటరీ ప్యాడ్లు, డయాపర్లు,
ప్రత్యేక/ప్రమాదకర చెత్తలో ఎలక్ట్రానిక్ వస్తువులు, పెయింట్ డబ్బాలు, మందుల సీసాలు, బ్యాటరీలు వంటి వాటిని వేర్వేరుగా ఉంచాలని సూచించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత మాట్లాడుతూ, “కోరుట్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం ద్వారా పారిశుధ్య నిర్వహణ సులభతరం కావడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు” అని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర మాట్లాడుతూ, “జీరో వేస్ట్ వార్డులో వంద శాతం చెత్త విభజన జరిగేలా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తడి, పొడి చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను కూడా నిర్దేశిత విధంగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
