(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
పేద ప్రజలకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొనసాగిస్తున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంతో పాటు మెట్‌పల్లి, కోరుట్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ముందుగా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా, వర్సకొండ, ములారాంపూర్, బర్తిపూర్, వేములకుర్తి, తిమ్మాపూర్, గొదూర్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా 18 మంది లబ్ధిదారులకు రూ.6,14,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మెట్‌పల్లి పట్టణానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు రూ.6,78,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
తదుపరి కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు రూ.7,61,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ మూడు కార్యక్రమాల ద్వారా మొత్తం 83 మంది లబ్ధిదారులకు రూ.20,53,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


