గమనిక: ఇది ఒక సాధారణ కథ మాత్రమే. ఈ కథకు భారతదేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధము లేదు. కావున పాఠకులు గమనించగలరు.
అనగనగా అవంతీ రాజ్యముండేడిది. ఆ రాజ్యానికి ఎన్నో సామంతరాజ్యాలు వుండేడివి. తమ సామంతరాజుల నుండి ప్రతి మాసం కప్పం వసూలు చేయడానికి ఆ రాజు దండనాయకులను ఏర్పాటు చేసుకునేడివాడు. రాజుకు విధిగా చెల్లించాల్సిన కప్పం అప్పగించడం దండనాయకుల విధి. ఆ తరువాత సామంతరాజుల వద్ధ వారు ఎంతగా తీసుకుంటున్నది రాజుల వారు పట్టించుకునేడి వారు కాదు. దానితో దండనాయకులుగా ఎన్నిక కావడానికి రాజుల వారి వద్ధ చాలా తీవ్రమైన పోటీ వుండేడిది. ఒక్కొక్కసారి రాజుల వారికి రాజప్రసాదములో వుండే మంత్రివర్యులు కూడా కొన్ని అభరణాలకు లొంగిపోయి కొందరిని దండనాయకులను ఎంపిక చేయించేడివారు. దండనాయకుల విధులు ఆ సామంత రాజ్యంలో పన్నులు వసూలు చేయడం, సామంతరాజు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటుగా వసూలు చేసిన పన్నులు పద్ధతి ప్రకారం రాజుల వారికి అందించడం అతని విధి. సామంతరాజు పాలనపరమైన వ్యవహరాలు పర్యవేక్షిస్తే, దండనాయకులు ఆర్థికపరమైన వ్యవహరాలతో పాటుగా రాజుగారి అంతరంగ వ్యవహరాలు నిర్వహించేడివారు. అది ఆ రాజ్య నియమం.
అలాంటి సరళమైన నిబంధనలు వున్న అవంతీ రాజ్యంలోని ఓ పరిగణానికి సామంత్‌వర్మ అనే సైనికుడు దండనాయకునిగా ఎన్నిక కావాలని అనుకున్నాడు. అంతవరకు పరాయి దేశంలో చంద్రగుప్త రాజుగారి వద్ద సైనికునిగా పనిచేసిన అనుభవంతో ఏలాగైనా దండనాయకునిగా ఎన్నిక కావాలని పథకం రచించాడు. అందులో భాగంగా రాజుల వారి ఆస్థానములో ముఖ్య సలహాదారునిగా వున్న జయపాల్‌వర్మను కలిశాడు. తన మనసులోని మాటను బయటపెట్టాడు. తను కూడా వర్మ వంశస్థుడనే అని తెలిపాడు. తమ కుటుంబానికి వారికి వున్న సంబంధాన్ని గుర్తుకు చేశాడు. దీనితో మనసు కరిగిన జయపాల్‌వర్మ సావంత్‌వర్మను దండనాయకునిగా నియమించమని రాజుల వారికి విన్నవించాడు. అలా ఒక పరగణానికి ఆయన దండనాయకునిగా నియమించబడ్డాడు.
నియమింపబడ్డ మొదటిరోజు నుండే రాజ్యంలో జరుగుతున్న పన్నుల విధానం లోతుపాతులు పూర్తిగా తెలుసుకున్నాడు. సామంతరాజు తాను చెప్పినట్లు వింటాడని రాజ్యంలో వుండే ముఖ్య ఉద్యోగులకు చెప్పి విపరీతంగా నాణేలు వసూలు చేసేవాడు. మాములుగా ప్రతి దండనాయకుడు ప్రతిమాసం చెల్లించే మొత్తాని కంటే సావంత్‌వర్మ ఎక్కువగా నిధులను రాజుల వారికి అప్పగించేడివాడు. అలా రాజుల వారి దృష్టిలో సావంత్‌వర్మ గొప్ప చాతుర్యం వున్న వాడిగా, క్రమం తప్పకుండా నిధుల సమకూర్చే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. అయితే దండనాయకునిగా ఎంత గుర్తింపు పొందినా, తెరచాటు రాజకీయాలు చేయడమే తప్పితే సింహసనం మీద కూర్చున్నది లేదు పేరు ప్రఖ్యాతులు సంపాదించినది లేదు అనే వెలితి సావంత్‌వర్మకు మిక్కిలిగా వుండేడిది.
దీనితో ఎలాగైనా సామంతరాజును కావాలనే కోరిక రోజురోజుకి సావంత్‌వర్మ మనసులో బలపడసాగింది. అందుకోసం తనకు గురువులాంటి జయపాల్‌వర్మతో పథకం రచించాడు. తన పథకంలో భాగంగా ప్రతిమాసం కప్పం చెల్లించడానికి రాజప్రసాదానికి వస్తున్న సమయంలో అక్కడ వున్న ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి, పరిచారికలకు, సామంతరాజు గురించి చెడుగా ప్రచారం చేసేడివాడు. వారికి కొంత రొక్కం చెల్లించి వారిని మచ్చిక చేసుకొని వారితో సామంతరాజు అసమర్థుడు, చెడ్డవాడు, పరిపాలన చేసే సామర్థ్యము లేనివాడనే ప్రచారం చేయించేవాడు. వారు రాజప్రసాదములో, రాజుగారి ముందు సామంతరాజు అసమర్థుడు అని వీలు చిక్కినప్పుడు చెప్పెడివారు. అలా ఒక్కరక్కరుగా వున్న ప్రచారం వందల సంఖ్యలోకి మారి రాజుగారు అసమర్థుడు అనే ప్రచారం నిలిచిపోయింది.
ఆ తరువాత సామంత్‌వర్మ తన పథకాన్ని రాజ్యంలో ప్రారంభించాడు. సామంతరాజు అసమర్థుడు అని గ్రామీణ ప్రాంతంలోను వాడడానికి సిగ్గు పడే భాషలో విమర్శించేడివాడు. ఆ భాష ప్రయోగాన్ని విని రాజ్యంలోని చాలా మంది ఆశ్చర్యపోయేడివారు. అలా కొద్ది కొద్దిగా సావంత్ వర్మకు కూడా అభిమానులు వెలిశారు. తనపై వాడుతున్న అసభ్యపదజాలాన్ని వాడుతున్న క్రమాన్ని గమనించిన సామంతరాజు అవంతీ రాజుల వారికి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే అప్పటికే సామంతరాజు మీద జరిగిన ప్రచారం ప్రభావం వల్ల రాజుల వారు సామంతరాజుని సింహసనం వీడమని ఆదేశించి తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు సావంత్‌వర్మను సామంతరాజుగా ప్రకటించాడు.
తాత్కాలిక సామంతునిగా ఎన్నికైన తరువాత కొత్త వారిని తిరిగి నియమించకుండా సావంత్‌వర్మ సరికొత్త ప్రణాళిక వేసుకున్నాడు. అవంతీ రాజుల వారి పేరున, వారి మాతృమూర్తి, పట్టపురాణి, పుత్రుల పేరున రాజ్యంలో సరికొత్త పథకాలు ప్రారంభించాడు. నిరుపేదలకు కుటీరాల నిర్మాణాలు, వ్యవసాయదారులకు పనిముట్లు, విద్యార్థులకు పలక, బలపం, యువకులకు శక్తి లాంటి ప్రవేశపెట్టి రాజుల వారి మెప్పు పొందాడు. తన పేరే కాకుండా తన పూర్వీకుల పేరున సావంత్‌వర్మ చేస్తున్న వివిధ కార్యక్రమాలను గమనించిన రాజులవారు సావంత్‌వర్మను శాశ్వత సామంతరాజుగా నియమించాడు. అయితే రాజుల వారి మన్నన పొందడానికి, ప్రజల మెప్పు పొందడానికి సావంత్‌వర్మ అభివృద్ధి పేరున ప్రకటించిన పథకాలు ఆచరణలో విఫలం కావడం ప్రారంభం కాసాగాయి. తన సామంత రాజ్యంలో ఎంత కష్టమైన రాజుల వారికి ప్రతిమాసం చెల్లించాల్సిన కప్పం మటుకు క్రమం తప్పకుండా రాజధానికి స్వయంగా వెళ్లి రాజుల వారికి చెల్లించేడివాడు. దీనితో సావంత్‌వర్మపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా రాజుల వారు పట్టించుకునేడివారు కాదు. సామంతరాజ్య పరిపాలన రోజురోజుకి అస్తవ్యస్థం అయినా అటు అవంతీ రాజుల వారు ఇటు సామంతరాజు ఎవరు పట్టించుకునేడివారు కాదు. దీనితో సామంతరాజ్యం మెల్లిమెల్లిగా అవినీతికి నిలయమై, లంచాలకు నిలయమై, ప్రగల్భాలకు నెలవై స్వార్థ రాజకీయాలకు కేంద్రం అయిపోయిందని అక్కడి ప్రజలు అనుకోసాగారు. అలా ఒక సాధారణ సైనికునిగా వున్న సావంత్‌వర్మ ఓ సామంతరాజుగా ఎదిగిన క్రమాన్ని, ఆయన చేసిన ప్రయత్నాలను అవంతీరాజ్యంలో కథలు కథలుగా చెప్పుకునేడివారు.
