(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు పరిశీలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పిలుపునిచ్చారు.
శుక్రవారం కోరుట్ల పట్టణంలోని 13వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, బీఎల్వోలు కలిసి వార్డు ప్రజలకు ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.
అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఓటరు పరిశీలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు పగడ్బందీగా విధులు నిర్వహించాలని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఒక్క ఓటు కూడా అక్రమంగా తొలగింపుకు గురికాకుండా ప్రతి ఓటరును గుర్తించి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో కొనసాగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, 143వ బూత్ లెవల్ ఏజెంట్ ఒలేపు రాజేష్, అంగన్వాడీ టీచర్ తిరుమల హిమగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
