
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డులో గల టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కల్యాణ మండపం ప్రాంగణాన్ని ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో శుభ్రపరిచే క్రమంలో ఆంజనేయస్వామి, కాలభైరవ స్వామి విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఎండోమెంట్ ధార్మిక సెల్ కన్వీనర్ మాడవేణి నరేష్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం పెద్దలు, కుల సభ్యులు అక్కడికి చేరుకుని విగ్రహాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి, కాలభైరవ స్వామికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టే ఉద్దేశంతో త్వరలో వేద పండితులను సంప్రదించి, ఆలయ నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ప్రజలంతా ఐక్యతతో ముందుకు వచ్చి ఆలయాల అభివృద్ధికి సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు పట్టణంలో సానుకూల వాతావరణానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఎండోమెంట్ ధార్మిక సెల్ కన్వీనర్ మాడవేణి నరేష్, నెమురీ విజయ్, ప్రేమ్, పాతర్ల సత్యం, సత్యనారాయణతో పాటు ముదిరాజ్ సంఘం పెద్దలు, సభ్యులు, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
