(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, చిన్న మెట్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టి కొమురయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
నిన్న (22.03.2026) ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లిన కొమురయ్య రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మొదట అతను తన తల్లి వద్ద ఉండి ఉంటాడని భావించిన భార్య, అక్కడ కూడా లేడని తెలిసిన తర్వాత వెతుకులాట ప్రారంభించింది.
ఈ రోజు తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో, అతని తల్లి నివసించే పాత ఇంటి వెనుక వాగులో నీటిలో బోర్లపడి తేలి ఉన్న మృతదేహాన్ని కొమురయ్య భార్య మరియు అన్న వెంకటస్వామి గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కొమురయ్యకు గత 20 సంవత్సరాలుగా ఫిట్స్ (మూర్చ) వ్యాధి ఉంది. వాగులో స్నానం చేసేందుకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడం, అలాగే ఈత రాకపోవడం వల్ల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
ఈ సంఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
