
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోరుట్ల ఎస్ఐ ఎం. చిరంజీవి, మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్ఐ రవికిరణ్ హాజరయ్యారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు మేడిపల్లి, కథలాపూర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని రౌడీషీటర్లు మరియు గతంలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసుల నిందితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి సత్ప్రవర్తన, మంచి నడవడికపై సీఐ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్ పరిధిలో గుండాయిజం, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండబోదని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, పోక్సో కేసుల నిందితుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
భవిష్యత్తులో భూ వివాదాలు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన గొడవలు, ఇతర తగాదాలు, మహిళలపై లైంగిక వేధింపులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
