
(తెలంగాణ సామ్నా డెస్క్)
మేడారం వేదికగా నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ కేబినెట్ భేటీకి ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది.
మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే సుమారు 300 మందికి వసతి కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు బస చేసేందుకు మేడారం హరిత హోటల్లో 16 గదులను కేటాయించగా, టెంట్ సిటీలో 40 తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. అదేవిధంగా తాడ్వాయి హరిత హోటల్లో మరో 30 గదులను అందుబాటులో ఉంచారు.
ఈ ఏర్పాట్లన్నింటిని మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేడారంలోనే ఉండి, సీఎం పర్యటనతో పాటు కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా ఆమె గమనిస్తున్నారు.
భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా 1,500 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హరిత హోటల్ పరిసరాల్లో భద్రతను పెంచి, పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మేడారానికి చేరుకోనున్నారు. అనంతరం వనదేవతల దర్శనం చేసి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం సీఎం, మంత్రులు మేడారంలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన గద్దెల ప్రారంభోతవ కార్యక్రమం కూడా జరగనుంది.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.) సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727
