(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీశాయి. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడుతున్న భర్తను భార్య రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఇప్ప కాశీరామ్, భార్య ఇప్ప రజిని దంపతులకు సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం కాగా, ముగ్గురు సంతానం ఉన్నారు. వివాహమైన నాటి నుంచి కాశీరామ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడని, మద్యం మత్తులో రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకోవడం, రహదారిపై పడుకోవడం వంటి చర్యలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించేవాడని సమాచారం.
ఈ వ్యవహారాలతో విసిగిపోయిన రజిని గత ఏడాది రోకలిబండతో కాశీరామ్ కాలిపై కొట్టగా, అతనికి తీవ్ర గాయాలై సుమారు ఆరు నెలలు చికిత్స పొందినట్లు తెలిసింది. అనంతరం మరోసారి సుమారు ఆరు నెలల క్రితం తలపై దాడి చేయగా, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నాడని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం.
బుధవారం కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో కలిసి వనభోజనాలకు వెళ్లిన సమయంలో కాశీరామ్ అధికంగా మద్యం సేవించి రోజంతా భార్యతో గొడవ పడినట్లు తెలిసింది. అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య మరోసారి గొడవ జరగగా, ఆగ్రహానికి గురైన రజిని రోకలిబండతో భర్త తలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో కాశీరామ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కోరుట్ల సీఐ కే. లక్ష్మీనారాయణ, ఎస్సై చిరంజీవి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని నిందితురాలు రజినిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

