(బాలే అజయ్, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా మంగళవారం కోరుట్ల పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోరుట్ల ఎస్సై చిరంజీవి కేసుకు సంబంధించిన వివరాల మేరకు కోరుట్ల ట్యాంక్‌బండ్ ప్రాంతంలో పోలీసులు గంజాయి అమ్ముతున్నారు అనే నమ్మకమైన సమాచారం మేరకు దాడి నిర్వహించడం జరిగింది అని తెలిపారు.
దాడి సమయంలో పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నిర్వహించిన తనిఖీలో మొత్తం 60 గ్రాముల ఎండు గంజాయిస్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకరి నుండి 40 గ్రాములు మరొకరి వద్ద 20 గ్రాముల గంజాయి లభ్యమైనట్టు తెలిపారు.
అదేవిధంగా, వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లుమరియు ఒక హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
అనంతరం నిర్వహించిన ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి, వ్యక్తిగత వినియోగంతో పాటు విక్రయాల కోసం తీసుకువచ్చినట్లు తెలిసిందని తెలిపారు. అందులో 20 గ్రాములను రెండో నిందితునికి విక్రయించినట్లు తెలిపాడు అని వివరించారు.
అరెస్ట్ చేసిన నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
*జిల్లా ప్రజలకు విజ్ఞప్తి: గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100/112 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని ఎస్సై చిరంజీవి తెలిపారు.
