
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు డి. శ్రీనివాస్ గురువారం ధర్మపురి, జగిత్యాల మున్సిపాలిటీలలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పత్రాల స్వీకరణ విధానం, ఎన్నికల నిబంధనల అమలు తీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరూ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. నామినేషన్ పత్రాల స్వీకరణలో అన్ని వివరాలు సక్రమంగా నింపబడేలా, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పూర్తిగా ఉన్నాయా లేదా అనే అంశాలను రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితిని మించకుండా ఖర్చులు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని సూచించారు. చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీ తరఫున చేసే ఖర్చులు, అభ్యర్థి వ్యక్తిగతంగా చేసే ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలని సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
