
తెలంగాణ సామ్నా డెస్క్: ఫిబ్రవరి 14. భారతీయ యువతపై విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్ది వారి మెదళ్లను, ఆలోచనా విధానాన్ని భారతీయ సాంప్రదాయ విలువల నుండి పక్కకు మళ్లించడానికి ఏరికోరి ఎంచుకోబడ్డ పలు రోజులలో ఇది ఒక రోజు.
ఎవో కొంపలు మునిగినట్టు.., ఇక ఈ రోజు పోతే జీవితమే పోయినట్టు…, బుద్ధిగా చదువుకొని, ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకొని, తన కుటుంబాన్ని కాపాడుకుంటు, తన ధర్మాన్ని నిలుపుకుంటూ, దేశంకు సేవచేయాల్సిన యువత అల్లరి చిల్లరగా తిరగడానికి ఒక రకంగా కారణం అవుతున్న రోజు ఫిబ్రవరి 14.
నేటి భారతీయ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి కొన్ని విదేశీ శక్తులు తమ సంస్కృతిని భారతీయ యువతలో ఇంజెక్ట్ చేయడానికి చేస్తున్న కృషి కొంతమేర ఫలించిందనే చెప్పవచ్చు. కాలేజీకి వెళ్లేది తమతో పాటుగా చదువుకునే అమ్మాయిలను ఏడ్పించడానికో లేదా ప్రేమించడానికో అన్నట్లుగా వచ్చే సినిమాలు కూడా యువతను పక్కదారి పట్టించేటట్టుగా కనిపిస్తున్నాయి. టివీ చానళ్లలో కార్యక్రమాలు సరేసరి. సొదరసోదరీలుగా కలిసి జీవితలక్ష్యాలను చేరుకునే క్రమంలో చేదోడువాదోడుగా వుండాల్సిన చోట విషాన్ని నింపుతున్న రోజు ఫిబ్రవరి 14 అనే వాదన కొత్తదేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమికుల రోజు అని చెప్పే ఫిబ్రవరి 14 ఒక రకంగా భారతీయ మూలాలను నాశనం చెయ్యాలని భారతదేశంలోకి వచ్చినదనే విమర్శ వుంది. ఆ రకంగా కొన్ని దశాబ్ధాల క్రితం వరకు విదేశీ దోపిడి శక్తులు భారతీయ యువతపై ప్రభావం చూపించాయి. కాని గత కొన్ని సంవత్సరాలుగా యువత మేల్కోంటుంది. విదేశీ సాంస్కృతిక దౌర్జన్యంపై తిరగబడుతున్నది. విదేశీ ప్రభావం వల్ల తమ జీవితాలు ఎంతగా నష్టపోతున్నామో.. తమ కుటుంబాలు ఎంతగా బాధపడుతున్నాయో ఆర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే భారతీయ యువత సరికొత్త జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటుంది.
కుటుంబం, కేరీర్, దేశభక్తి (ఎఫ్‌సిపి) అనే ఆలోచనతో యువత ముందుకు పోతున్నది. తాము కుటుంబానికి ఏం చేయగలం? ఏం చేస్తే నా కుటుంబం బాగుంటుంది? నా కేరీర్ మంచిగా వుండడానికి నేనేం చేయాలి? వీటితో పాటుగా నా దేశానికి నేనేం చేయగలను? అనే సరికొత్త నినాదంతో నేటి యువత ముందుకు కదులుతున్నది. ఇలాంటి ఆలోచన దేశయువతలో మెల్లిమెల్లిగా పెరుగుతుంది కాబట్టే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంది అనే వాదన వస్తున్నది. ఈ ఆలోచనను విమర్శించేవారు వుండొచ్చు. కాని యువత నిర్వీర్యం అయితే దేశం కూడా నిర్విర్యం అవుతుంది. అదే యువత దేశం గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తే దేశం అభివృద్ధి అవుతుంది అనేది అతి సాధారణ అభివృద్ధి మంత్రం అనే వాదన వస్తున్నది.
ఫిబ్రవరి 14 యే కాదు అలాంటి ఊహజనిత దినాలను, అదేదో అద్భుత రోజని, ప్రేమికుల రోజు అంటే ప్రేమికులకు ఎంతో పవిత్రమైన రోజు అని చేసిన సాంస్కృతిక సాంప్రదాయ విచ్చిన్న ప్రచారాన్ని భారతీయ యువత గమనించింది. అందుకే యువత అంటుంది. తల్లిదండ్రులను, కుటుంబాన్ని, దేశాన్ని ప్రేమించడమే నిజమైన ప్రేమ అని. వారిని ప్రేమించకుండా ‘ఓయాసిస్సుల’ వెంటపడి తిరిగే యువకులు తమ కుటుంబాలకు, సమాజానికి. దేశానికి, ధర్మానికి కూడా బరువే అనే వాదన బలంగా వస్తున్నది.
ఫిబ్రవరి 14,2019 భారతదేశం మరిచిపోలేని రోజు. భరతమాత తన 40 మంది వీరపుత్రులను తన కౌగిట చేర్చుకొని ప్రేమతో ముద్ధాడిన రోజు.
ఓ మత మూర్ఖుని వల్ల 40 మంది సిఆర్పీఏఫ్ జవాన్లు అమరులు అయిన రోజు అది.వారితో పాటు 35 మంది గాయాలైన దుర్దినం అది. ఆనాటి త్యాగపురుషులను తలుచుకుంటు నేటి భారతీయ ప్రజా ఫిబ్రవరి 14 తేదీని అమరవీరుల సంస్మరణ రోజుగా జరుపుకుంటుంది. ఇది భారతదేశ ప్రజల్లో వచ్చిన మార్పు అని చాలామంది చెబుతున్నారు. దేశభక్తి వైపు ఈనాటి యువత ముందుకు కదులుతుంది అనే దానికి ప్రత్యక్ష ఉదహరణగా చెబుతున్నారు.
నేటి యువతలో నేడు స్పష్టంగా కనిపిస్తున్న ఆంశాలు మూడు వున్నట్టుగా చెబుతున్నారు. ఒకటి దైవభక్తి, రెండు దేశభక్తి మూడవది కుటుంబం పట్ల బాధ్యత అనే చర్చ వస్తున్నది.
ముఖ్యంగా యువత ప్రేమ దోమ అనే వ్యాపకాలు దాదాపుగా మరిచిపోయి దేశం పట్ల దైవం పట్ల ధర్మం పట్ల తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చలానే ఆశయంతో ముందుకు కదులుతున్నట్లు వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అలా వుండాలనే ఆశిద్ధాం.
