(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ట్రాక్టర్ రోటవేటర్‌లో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రె అంజయ్య (28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ధర్మారం గ్రామానికి చెందిన నక్కిరెడ్డి ఆదిరెడ్డి ఒక రోజు ట్రాక్టర్ నడిపేందుకు అంజయ్యను కోరగా, అతను అంగీకరించాడు. దీంతో ఆదిరెడ్డికి చెందిన జాన్ డీర్ ట్రాక్టర్ AP-15-AH-1707ను తీసుకుని కోరుట్ల ఆదర్శ్‌నగర్‌లోని నేమురి సాయిరెడ్డికి చెందిన మామిడి తోటకు వెళ్లాడు.
గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో రోటవేటర్‌లో మట్టి ఇరుక్కుపోవడంతో ట్రాక్టర్‌ను నిలిపి కిందకు దిగిన అంజయ్య మట్టిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని గమనించిన కొమురి నరసింహ, ట్రాక్టర్ యజమాని నక్కిరెడ్డి ఆదిరెడ్డి వెంటనే అంజయ్యను రోటవేటర్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ విషయాన్ని ధర్మారం గ్రామ సర్పంచ్ దోడ రంజిత్ రెడ్డికి సమాచారం అందించగా, ఆయన మృతుడి తమ్ముడు గొర్రె అనిల్‌కు విషయం తెలిపారు.
మృతుడి తమ్ముడు గొర్రె అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.
