తెలంగాణ సామ్నా బ్యూరో: ఆ అబ్బాయి వయసు 18. మైనార్టీ తీరడానికి ఇంకా మూడు సంవత్సరాలు వుంది. ఆ యువతి వయసు 20. మైనార్టీ తీరి రెండు సంవత్సరాలు అయ్యింది. వారిద్ధరు ప్రేమలో పడ్డారు. వాస్తవంగా ఆ ఇద్దరిది ప్రేమలో వుండాల్సిన వయసేనా? అనే ప్రశ్న వస్తున్నది. ఆడవిలో నెమలిలా అందంగా ఆడుతూ పాడుతూ తమ తమ భవిష్యత్తును పెద్ధల ఆశీర్వాదాలతో తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో మైనర్‌గా వున్న అబ్బాయి, మైనార్టీ తీరిన అమ్మాయి ఇద్ధరు ప్రేమించేసుకున్నారు. కాని తమ ప్రేమను పెద్ధలు అంగీకరిస్తారో లేదో అని వారికి వారే డిసైడ్ అయ్యారు. ఒకవేళ ఒప్పుకోకపోతే విడదీస్తారేమో అని ఆలోచించుకున్నారు. విడిపోవడం వద్దు అనుకొని వుంటారు. ఇక మనల్ని ఎవ్వరు విడదీయకూడదు అంటే చావే శరణ్యం అని అనుకొని జమ్మికుంట మండలం బిజగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ పాపయ్యగేట్ వద్దకు చేరుకొని గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారిని గమనించిన లోకోపైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పోస్ట్‌మార్టం నిమిత్తం రెండు మృతదేహలను ఆస్పత్రికి తరలించారు. కాని వారు చనిపోయి పడివున్న స్థితిబట్టి వారిద్దరు అత్మహత్య చేసుకున్నట్లుగా లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేబడితే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఏ సందర్భంలో కూడా చనిపోయిన ఆ ఇద్దరి పేర్లు వారి ఊరి పేర్లు వాడకూడదనే అభిప్రాయంతో చేర్చడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరి పేర్లు అవసరం లేదు. కేవలం సమస్య తెలియాలి. ఇలాంటి సమస్యలకు కొంతలో పరిష్కారం దొరుకుతుంది అనే భావన)
‘‘ప్రేమ పిచ్చిది’’ చాలా సినిమాల్లో విన్న మాటే. ఆ అబ్బాయి ఈ అమ్మాయిల ప్రేమ వ్యవహారం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అమ్మాయి చదివుతున్నది డిగ్రీ మొదటి సంవత్సరం. తన జీవితంకు త్రోవ చూపించాల్సిన కనీస అర్హత అయిన డిగ్రీ పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. పోనీ అబ్బాయి చాలా సంపన్నుడు కాదు. ఎందుకంటే 18 సంవత్సరాలకే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కష్టపడి చదవాల్సిన వయసులో కష్టపడి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదికాక తనకంటే అబ్బాయి రెండు సంవత్సరాలు చిన్నవాడు. ఏ అర్హతతో ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇలాంటి పెళ్లికి ఒప్పుకుంటారా? అనే ప్రశ్న వస్తున్నది. అంటే ఏ రకంగా చూసిన అటు అమ్మాయి ఇటు అబ్బాయి ప్రేమపిచ్చిలో పడిపోయారే కాని వాస్తవ జీవన దృష్టితో ఆలోచించలేదనే వాదన వస్తున్నది.
పిల్లలు వాస్తవాన్ని వాస్తవంగా చూడని పరిస్థితి రావడానికి కారణం సోషల్‌మీడియానే అనే విమర్శ వస్తున్నది. టినేజీలో వున్న పిల్లలను తల్లిదండ్రులు స్నేహితులుగా చూడకపోవడం, వారితో లోకం పోకడలు చర్చించకపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదన వస్తున్నది. కడుపుకోత భరిస్తూ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడే పరిస్థితులు ఎర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అత్యంత విషాదకరం. మోహమాటాలు లేకుండా తల్లిదండ్రులు అమ్మాయిలతో కాని అబ్బాయిలతో కాని జీవితం గూర్చి, వారి వారి భవిష్యత్తు గురించి వారంలో కనీసం ఒక్కరోజైనా చర్చిస్తే పిల్లల అభిప్రాయాలు మారే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.


