(తెలంగాణ సామ్నా డెస్క్)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రత్యేకించి జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా అమ్ముతున్న ఐస్‌క్రీం, కుల్ఫీ, బాదాంమిల్క్ లాంటి నాసిరకం వస్తువుల్ని అమ్మడాన్ని నిషేదిస్తూ పలు గ్రామాల్లో కీలకనిర్ణయం తీసుకుంటున్నాయి. చిరువ్యాపారులు ఇంట్లో తయారుచేసిన కూల్‌డ్రింక్స్‌ను తోపుడు బండ్లలో తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా తల్లిదండ్రులకు ఆర్థికభారంగా మారుతున్నది. దీనిని దష్టిలో పెట్టుకొని కొద్దిరోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై కాని వాహనాలపై తీసుకువచ్చే నాసిరకం తినుబండరాలను గ్రామాల్లోకి రానివ్వం అని ఫెక్ల్సిలు వెలిసాయి. తాజాగా ఆర్మూర్ మండలంలోని అంక్సాపూర్, కొలిపాక, జక్రాన్‌పల్లి,వేల్పూరు, అంకాపూర్ గ్రామాల్లో కూడా ఐస్‌క్రీమ్ బండ్లకు ఆనుమతి ఇవ్వమని గ్రామంలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. గ్రామాల్లోకి ఐస్‌క్రీమ్ బండ్లు వస్తే రూ. 5000లు జరిమానా విధించబడుతుంది అని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వతా హర్షం వ్యక్తం అవుతుంది.
