(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
మొదటగా కోరుట్ల పట్టణంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన గడి బురుజు భూమిపై విధించిన వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT)ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. గడి బురుజు భూమి పట్టణ ప్రజల ఆస్తి మాత్రమే కాకుండా చారిత్రక, సామాజిక ప్రాధాన్యం కలిగిన స్థలమని, దీనిని ప్రజా ప్రయోజనాల కోసం పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
అనంతరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రీయింబర్స్‌మెంట్ నిధుల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల విద్యాభవిష్యత్తు దెబ్బతినకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రెండు అంశాలపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.
