
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణం, మాదాపూర్ కాలనీకి చెందిన బిల్లికర్ దేవిశ్రీప్రసాద్ (వయస్సు 19 సంవత్సరాలు) మరియు భీముని దుబ్బకు చెందిన ఏనుగుల రాజేష్ (వయస్సు 20 సంవత్సరాలు) చెడు వ్యసనాలకు అలవాటు పడి, గత రెండు నెలలుగా గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
వారు ఒక గుర్తుతెలియని యువకుడి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కోరుట్ల మండలంతో పాటు పట్టణంలోని యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం అందిందినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. చిరంజీవి వివరాలు వెల్లడించారు.
అదే క్రమంలో జగిత్యాల జిల్లాలోని ఒక గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని తీసుకొని, బజాజ్ డిస్కవరీ బైక్‌పై విక్రయించేందుకు కోరుట్ల మాదాపూర్ కాలనీ వైపు వెళ్తుండగా, నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కోరుట్ల శివారులోని మాదాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎస్సై ఎం. చిరంజీవి మరియు పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, ఒక బజాజ్ డిస్కవరీ ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికే ఇలాంటి కేసులు నమోదు చేశామని, మత్తు పదార్థాల అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
