
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల రెవెన్యూ డివిజన్ స్థాయిలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తేది: 04.05.2026 సోమవారం రోజున ప్రారంభించారు. ఇంతకుముందు జిల్లా కలెక్టరేట్లో మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు డివిజన్ స్థాయికి విస్తరించారు.
ఈ సందర్భంగా కోరుట్లలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను డివిజన్ స్థాయి అధికారులు మరియు తహసీల్దార్లు స్వీకరించారు. మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు ఏడు, మున్సిపల్ శాఖకు ఒకటి, పంచాయతీరాజ్ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. జీవాకర్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్ కేంద్రంతో పాటు పరిధిలోని పలు మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలను వినిపించేందుకు ప్రజావాణికి హాజరయ్యారని తెలిపారు. అధికారులు తమ శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి, సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇట్టి ప్రజావాణి కార్యక్రమం ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు అయిన జిల్లా పంచాయతీ అధికారి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, వ్యవసాయ అభివృద్ధి అధికారి, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి, తహసీల్దార్లు, ఆర్ అండ్ బి శాఖ డివిజనల్ ఇంజనీర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ డివిజనల్ ఇంజనీర్, హౌసింగ్ డివిజనల్ ఇంజనీర్, సహకార అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.&హెచ్.ఓ. జైపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ సబ్ డివిజన్ డి.ఈ.ఈ. ఎం. సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

