
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ శ్రీమతి వసంత తిరుమల అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ ముందుంచిన 8 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. ముఖ్యంగా వర్షపు నీరు నిలిచిపోకుండా, మురికి కాలువలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీనిపై స్పందించిన చైర్పర్సన్ వసంత తిరుమలతో పాటు కౌన్సిల్ సభ్యులు, ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికి కాలువలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వసంత తిరుమల, మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర, వైస్ చైర్పర్సన్ మహమ్మద్ షాహిద్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, డిప్యూటీ ఈఈ, మేనేజర్, టీపీఓ, ఏఈ, జేఏఓ, ఆర్ఓ, ఎస్ఐతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
