(నిన్నటి తరువాయి)
ఇంకా, నేను డిల్లీలో వుండగా 1948 జనవరి 20 తేదిన ఆయుధములను, మందుగుండు సామాగ్రిని వుంచుకోనుటో లేక అట్లు వుంచుకొనుటకు ఇతరులకు సహాయము చేయుటో చేసితినని ఆరోపణ పత్రములో ‘‘రెండవది’’ అను శీర్షిక క్రింద బి (1), బి(2) పేరాలలో చేయబడిన ఆరోపణను నేను తిరస్కరించుచున్నాను.
ఈ విషయములో గూడ ఈ ఆరోపణను బలపరుస్తూ బాడ్గె ఒక్కడే సాక్ష్యము పలికియున్నాడు. తన్ను తాను రక్షించుకొనుటకు అతను ఇట్టి తప్పుడు సాక్ష్యము ఇచ్చినాడని విన్నవించుకొనుచున్నాను. ఎందువల్ల నంటే అట్టి సాక్ష్యము ఇచ్చు షరతుపైననే ఇతను క్షమాపణ ప్రధానము పొందగల్గినాడు.
- ‘‘మూడవదిగా’’ అను శీర్షిక క్రింద వున్న అభియోగము విషయములో ఆ అభియోగమును ఎ(1), (2), బి(1) (2) పేరాలలో చెప్పబడిన ఆ ఆభియోగములోని నేరమును జరుపుటకు సహాయపడితినను ఆరోపణను నేను తిరస్కరించుచున్నానని చెప్పుచున్నాను.
- ‘‘నాల్గవది’’ అను శీర్షిక క్రింద 2వ పేరాలో చేయబడిన అభియోగము విషయములో 1948 జనవరి 20 తేది బిర్లా భవనము వద్ద మదన్‌లాల్ కె.పహ్వ ఒక గన్ కాటన్ స్లాబును పేల్చుటలో నేను ఒక్కడినే వ్యక్తిగతముగా గాని, ఇతరులతో కలిసి గాని సహాయము చేసితినను ఆరోపణను నిరాకరించుచున్నాను. అట్టి ఆరోపణను నిర్ధారించుటకు సాక్షములేదనిన్ని, ఏదైనా కొద్ది సాక్ష్యమున్నా అది గన్ కాటన్ స్లాబు ప్రేలుడులో నాకు సంబంధము వున్నట్లు ఏ విధముగను రుజువు చేయుటలేదనిన్ని నేను చెప్పుచున్నాను.
- నేరారోపణ పత్రములో ‘‘ఐదవదిగా’’ అను శీర్షిక కింద ‘‘మహాత్మాగాంధీని హత్యచేయుటకు జరిగిన ప్రయత్నమునకు సహాయపడితిని ఇఅన్న నార్పోణను నేను తిరస్కరించుచున్నాను. మదన్‌లాల్ పహ్వాతో గాని, మరెవ్వరితోనైన గాని నాకు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఎట్టి సంబంధము లేదని చెప్పుచున్నాను. ఈ ఆరోపణను సమర్థించుచు ఏలాంటి సాక్ష్యము లేదని కూడా నేను చెప్పుచున్నాను.
(తరువాయి బాగం రేపు)
