(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లేఖ రాశారు.
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరంలోని ఘాట్‌ల వద్ద పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్‌ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఘాట్‌ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమాస్ట్ లైట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు.
పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు.
