(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవల అభివృద్ధికి సంబంధించిన 19 కీలక వినతిపత్రాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పలు అంశాలపై వివరంగా చర్చించారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులను బదిలీ చేయకుండా కొనసాగించాలని, ఖాళీ పోస్టులను కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు, అవసరమైన సిబ్బంది, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచడం, 100 పడకల ఆసుపత్రికి అవసరమైన క్యాడర్ స్ట్రెంగ్త్‌ను మంజూరు చేయడం, మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడం, ప్రత్యేక అంబులెన్స్ మంజూరు చేయడం, నూతన ఆసుపత్రి భవనానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అదేవిధంగా సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పైప్‌లైన్, రెండు బోర్‌వెల్లు, 17 ఆరోగ్య ఉపకేంద్ర భవనాల పూర్తి కోసం అదనపు నిధులు, కోరుట్ల మండలం మాధాపూర్‌లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
