(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపాలిటీ ఉక్కుపాదం మోపింది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో శనివారం పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులు, టిఫిన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన మున్సిపల్ అధికారులు భారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు మొత్తం రూ.10,200 జరిమానాలు విధించారు.
దాడుల సమయంలో పలువురు వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే భారీ ఫైన్లు మాత్రమే కాకుండా దుకాణాలు సీజ్ చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా బట్ట సంచులను వినియోగించాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులకు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని, గడువు ముగిసిన వారు తక్షణమే రెన్యువల్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు దుకాణాలు సీజ్ చేసే చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. వ్యాపార సంస్థల నుంచి వెలువడే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేర్వేరుగా నిల్వ చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, లేకపోతే ఎస్.డబ్ల్యూ.ఎం -2019 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, జవాన్లు విష్ణువర్ధన్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

