(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యుడు డా. వై. అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో శుక్రవారం అధికారికంగా చేరారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆయనకు క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు సమక్షంలో చేరిక జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల నియోజకవర్గం నుంచి సుమారు 350 మంది నాయకులు, కార్యకర్తలు 70–80 కార్లలో కోరుట్లలోని అనూప్ రావు ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలివెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. అనూప్ రావు మాట్లాడుతూ దేశాభివృద్ధి, ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో సక్రియంగా పాల్గొంటానని స్పష్టం చేశారు.

