
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కోరుట్ల పట్టణంలో వాహన డ్రైవర్లకు ఉచిత నేత్ర మరియు వైద్య పరీక్షల శిబిరం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
ఇట్టి కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. లారీ, డీసీఎం, కారు, అంబులెన్స్, ఆటో తదితర వాణిజ్య మరియు ప్రజా రవాణా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, రోడ్డు భద్రతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “సర్వేంద్రియాలలో నేత్రం ప్రథానం. కంటి చూపు స్పష్టంగా ఉండటమే సురక్షిత డ్రైవింగ్‌కు మౌలిక అవసరమని, కళ్ళు సరిగా కనిపిస్తేనే మెదడు స్టీరింగ్, క్లచ్, బ్రేక్ వంటి నియంత్రణలపై సమయానికి స్పందిస్తుంది. డ్రైవర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా భద్రత కల్పించే బాధ్యతతో వాహనం నడపాలి” అని సూచించారు.
వైద్యులు మాట్లాడుతూ, నిరంతరం డ్రైవింగ్ చేసే వారు కనీసం ఆరు నెలలకు ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. శిబిరానికి హాజరైన డ్రైవర్లు ఉచిత నేత్ర పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారికి వైద్య సలహాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ అడ్లూరి రాములు, సిఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, ఎస్సై రామచంద్రం, మెట్పల్లి పోలీస్ అధికారులు, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైద్యులు డా. రేగొండ రాజేష్, డా. సంపత్ కుమార్, డా. సమీర్, డా. కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, లారీ యూనియన్ అధ్యక్షుడు అన్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

