తెలంగాణ సామ్నా డెస్క్: పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట అనే గ్రామంలో సాయికుమార్ అనే యువకుడు గురువారం హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఒక తండ్రి తన కూతురుతో తిరగవద్దని చెప్పిన మాటల్ని సాయికుమార్ పట్టించుకోకపోవడం వల్లనే ఈ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో సాయికుమార్ హత్య పరువు హత్యా లేక కూతురుపై ఓ తండ్రి పెంచుకున్న మమకారపు హత్యా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రియురాలితో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కాసేపటికే అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడిచేసి సాయికుమార్‌ను హత్యచేశాడు. సాయికుమార్‌ది అతను ప్రేమించిన అమ్మాయిది వేరువేరు కులాలు. దీనితో సహజంగా అమ్మాయి తండ్రి వారి ప్రేమను ఒప్పుకోలేదు. వీని విషయంపై ఒకసారి గ్రామంలో పంచాయితీ జరిగినట్లు తెలుస్తున్నది. గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు రెండు వైపులా తల్లి తండ్రి మాటలు పట్టించుకున్నట్లు లేదు. సాయికుమార్ పుట్టినరోజున కేక్ కట్ చేసే సమయంలో అతని ప్రియురాలుతో కలిసి వున్నట్లు సమాచారం. తాను చెప్పినా సాయికుమార్ వినడం లేదనే కోపంతో అమ్మాయి తండ్రి గొడ్డలితో కిరాతకంగా సాయికుమార్‌పై దాడి చేసి హత్యచేశాడు.
ఈ సందర్భంలో ఒక ప్రశ్న వస్తున్నది. ఈ హత్య కూతురుపై తండ్రికి విపరీతమైన మమకారం వుండడం వల్లే సాయికుమార్‌ను హత్య చేశాడని కొందరు చెబుతున్నారు. ఇది పరువు హత్య కాదని కూతురుపై వున్న మమకారపు హత్యగా అంటున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే హత్య చేసిన తండ్రి వాస్తవంగా ఆలోచించివుంటే కూతురును మందలించాల్సి వుండాల్సింది అనే వాదన వస్తున్నది. ఒకవేళ కూతురు వెంట సాయికుమార్ పడి ఆమెను ఇబ్బంది పెట్టి వుంటే పుట్టినరోజు ఫంక్షన్‌కు ఆ అమ్మాయి ఎందుకు వెలుతుంది? పుట్టినరోజు ఫంక్షన్‌కు ఆ అమ్మాయి వెళ్లిందంటే తండ్రి మాట ఆ కూతురు వినలేదని భావించాల్సి వుంటుందని పలువురు వ్యాఖానిస్తున్నారు. ఈ విచక్షణ లేకుండా తండ్రి కూతురుపై పెంచుకున్న మమకారపు తాలుకూ ఆవేశానికి ప్రతిరూపమే ఆ హత్య అనే వాదన వస్తున్నది. ఈ నేపథ్యంలో తండ్రి పరువు తీసింది కూతురా? లేక మృతుడైన సాయికుమారా? అనే ప్రశ్న వస్తున్నది. కొందరు సాయికుమార్ మైనర్ అని చెబుతుంటే మరికొందరు ఇద్దరు మేజర్లే అని ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ మైనర్ మేజర్ అనే సమస్య కాకుండా కులాలు, తల్లిదండ్రుల యిష్టాయిష్టాలు కూడా పరగణలోకి తీసుకోబడతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తమ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న క్రమంలో తల్లిదండ్రులు కొంత సమయాన్ని వారికి కేటాయించి కుటుంబ విలువలు, బాధ్యతలు, నైతిక విలువలు, సదాచారం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఓ కుటుంబానికి డబ్బు ఎంత అవసరమో బంధాలు, అనుబంధాల ఆస్థి కూడా అంతే అవసరం అనే వాదన వస్తున్నది.



