
తెలంగాణ సామ్నా బ్యూరో: లగ్గం చేసుకోవాలే… తెల్లారే కనిపించకుండా పోవాలే. ఇలా అంటే ఏ నిత్యపెళ్లికొడుకు ఎవరో పాపం ఓ అమ్మాయి వున్న కుటుంబాన్ని మోసం చేశాడని అనుకునేరు? అట్లా పెళ్లి చేసుకొని ఇట్లా పరాయి అయ్యేది పెళ్లి కొడుకు కాదు ఓ నిత్య పెళ్లికూతురు. డబ్బు హోదా వున్న వారిని లక్ష్యంగా చేసుకొని వారికి వలపు వల విసిరి నలుగురిని మోసం చేసింది ఆ కిలాడీ లేడి. ముగ్గురిని ఎలాంటి అనుమానం రాకుండా మోసం చేసి నాలుగవ వ్యక్తిని కూడా అలాగే మోసం చేద్దామని భావించిన నేపథ్యంలో ఆ కిలాడీ నిత్య పెళ్లికూతురు పెళ్లిళ్ల భాగోతం బట్టబయలైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని మద్దూరు జిల్లా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె వైష్ణవి. మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన శశికాంత్ ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు పెళ్లిచేసుకున్నారు. ఇంత వరకు అంతా బాగానే వున్నట్లు కనిపిస్తునది. అయితే పెళ్లికి ముందే వైష్ణవి తాము చాలా పేదవారిమని శశికాంత్ వద్ద రుపాయలు 7 లక్షలతో పాటుగా 100 గ్రాముల బంగారం వైష్ణవి తీసుకుంది. ఆ తరువాత వీరి పెళ్లి జరిగిన మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరే చాముండేశ్వరి ఆలయానికి కారులో వెళ్తున్న క్రమంలో ఓ రైల్వే గేటు వద్ధ వాటర్ బాటిల్ కోసం శశికాంత్ దిగినాడు. అయితే అంతకు ముందే వేసుకున్న పథకం ప్రకారం వైష్ణవి తన వెనకాలే వస్తున్న మరో కారు ఎక్కి చెక్కెసింది.
తన నూతన భార్య కనిపించడంల లేదని కంగారు పడ్డ శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆశ్చర్యకరమైన, విస్తుపోయే విషయాలు తెలిసాయి. చి.ల.సౌ. వైష్ణవి గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇలాగే ముగ్గురు పెళ్లికొడుకులను మోసం చేసిందని పోలీసులు విచారించగా తెలిసింది. మూడు చోట్ల కూడా ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి, ఆ తరువాత పెళ్లి చేసుకొని డబ్బు నగలతో పరార్ అయినట్లు తెలుసుకున్న పోలీసులు సదరు నిత్య పెళ్లికూతురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
