
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
2–3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన.. పోలీసుల దర్యాప్తు
పట్టణంలోని అర్బన్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు బత్తుల గంగానర్సు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇంటి వాకిట్లో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. గంగానర్సు కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం మున్సిపల్ సిబ్బంది కాలనీలో డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో దుర్వాసన రావడంతో ఆ ప్రాంతంలో పరిశీలించగా, వృద్ధురాలి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి ఆమె మృతి చెంది రెండు, మూడు రోజులు అయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గంగానర్సుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, కుమార్తె మరియు కుమారుల్లో ఒకరు మృతి చెందినట్లు, మరో కుమారుడు సాయిరాం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లి మృతి విషయం తెలుసుకున్న సాయిరాం హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు అనంతరం వృద్ధురాలి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

