32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

హత్యాయత్నం చేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్ – రిమాండ్ కు తరలింపు

(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)

బుధవారం ఉదయం వార్తతో వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసుల చర్యలు.. నిందితులకు రిమాండ్

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో గుద్దేటి రాజేందర్‌పై జరిగిన కత్తి దాడి ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దసరా సందర్భంగా దుర్గామాత నిమజ్జనం నేపథ్యంలో తలెత్తిన వివాదం కత్తితో దాడికి దారితీయగా, ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు కోరుట్ల పోలీసులు వెల్లడించారు.

అర్బన్ కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మొదలైన వివాదం, ట్రాక్టర్‌పై అలంకరణలు తొలగిస్తున్న సమయంలో దాడి జరిగే వరకు వెళ్లినట్లు ఈ ఘటనపై గతంలో వెలువడిన వార్తలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన రాజేందర్‌పై దాడికి సంబంధించి తాజాగా కోరుట్ల పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43)కు రామ్ నగర్ కాలనీకి చెందిన కిరణ్ (19), అజయ్ (19)లతో నిమజ్జనం సందర్భంగా వివాదం తలెత్తింది. అక్టోబర్ 21వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కిరణ్, అజయ్‌తో పాటు జ్ఞానదీప్ (20) అర్బన్ కాలనీలోని దుర్గామాత ఆలయం వద్దకు వచ్చి రాజేందర్‌తో గొడవకు దిగారు.

ఈ క్రమంలో కిరణ్, అజయ్‌లు రాజేందర్‌ను పట్టుకోగా, జ్ఞానదీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దీంతో రాజేందర్ ఎడమ భుజం, మెడ ఎడమ వైపు గాయాలయ్యాయి. స్థానికులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్, అజయ్, జ్ఞానదీప్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఘటనపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే ఉత్కంఠకు పోలీసుల ప్రకటనతో తెరపడింది. చిన్నపాటి వివాదం కత్తి దాడికి దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పండుగల సమయంలో సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. తిరుపతి, సబ్‌-ఇన్‌స్పెక్టర్ జి. శ్యామ్ రాజ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles