
బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం రాత్రి సుమారు పది గంటలకు భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుండి కోరుట్ల వైపుగా వెళ్తున్న TS 08 EP 8784 నంబరు గల కారు వ్యవసాయ మార్కెట్ సమీపంలో అదుపుతప్పి ముందుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్క నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొని, అక్కడితో ఆగకుండా ముందుకు దూసుకెళ్లి అష్టలక్ష్మి దేవాలయం కమాన్ పక్కన పార్కింగ్‌లో ఉన్న TL 21 L 7394 నంబరు గల కారును వెనుక నుండి ఢీకొట్టింది.
ఈ ఢీకొట్టిన ప్రభావంతో పార్క్ చేసిన కారు దేవాలయం కమాన్ వైపు లాగబడగా, సంఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా కేసు నమోదు కాలేదని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

