
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో హిందూ ఐక్యతకు ప్రతీకగా మహిళా మణులచే భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి మద్దతుగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు ఐలాపూర్ రోడ్ లో గల పెద్దమ్మ దేవాలయం నుండి న భూతో న భవిష్యత్తు అనిపించేలా మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణాన్ని కాషాయమయం చేశారు.
“జైశ్రీరామ్ జై జై శ్రీరామ్” నినాదాలతో యువతులు, మహిళలు మరియు వారితో పాటు యువకులు, పురుషులు ఉత్సాహంగా పాల్గొనడంతో కోరుట్ల ప్రధాన వీధులు సరికొత్తగా శోభమయంతో నిండిపోయింది.
ఈ నెల 9వ తేదీన అప్పలక్ష్మి దేవాలయంలో జరగనున్న హిందూ సమ్మేళనానికి ప్రజలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీకి మహిళల నుండి పట్టణ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. నెత్తిన కాషాయ తలపాగా, చేతుల్లో కాషాయ జెండాలతో మహిళలు బైక్‌లపై ధార్మిక నినాదాలతో భారీగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ర్యాలీ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. హిందూ సమాజంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, ధార్మిక చైతన్యం పెంపొందించడమే సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల నేపథ్యంలో హిందువులు ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న మహిళలు “హిందూ సమైక్యత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళలు ముందుకు రావాలి” అంటూ పిలుపునిచ్చారు.
కోరుట్లలో ఎన్నడూ లేని విధంగా మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ బైక్ ర్యాలీ ప్రస్తుతం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.


