(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో కొత్త ఆసరా (చేయూత) పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ వి. రాఘవేంద్ర తెలిపారు. అర్హులైన పట్టణ ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం నిర్దేశించిన వివిధ కేటగిరీలకు సంబంధించి అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను అధికారులు వెల్లడించారు.
వితంతువుల పెన్షన్: 18 సంవత్సరాలు నిండిన వితంతువులు దరఖాస్తు చేసుకోవచ్చు. భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాలి. ఈ కేటగిరీలో నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
ఒంటరి మహిళల పెన్షన్: వివాహిత మహిళలు 18 ఏళ్లు నిండి, భర్తకు దూరంగా లేదా విడిపోయి కనీసం ఏడాది పూర్తయి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడి ఉండాలి. విడాకులు లేదా విడిపోయినట్లు తెలిపే పత్రం, లేదా తహసీల్దార్ స్థానిక విచారణ నివేదికను సమర్పించాలి. ఈ కేటగిరీలో నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
దివ్యాంగుల పెన్షన్: దివ్యాంగులకు వయోపరిమితి లేదు. SADAREM ద్వారా కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం లేదా UDID కార్డు ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి కనీసం 51 శాతం వైకల్యం ఉండాలి. అర్హులైన వారికి నెలకు రూ.4,016 పెన్షన్ అందుతుంది.
గీత కార్మికుల పెన్షన్: 50 సంవత్సరాలు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణతో పాటు గీత కార్మిక సహకార సంఘంలో సభ్యత్వం ఉండాలి. ఈ కేటగిరీలో నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
చేనేత కార్మికుల పెన్షన్: 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులు అర్హులు. చేనేత, జౌళి శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అర్హులకు నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
ఫైలేరియా బాధితుల పెన్షన్: గ్రేడ్-2, గ్రేడ్-3 ఫైలేరియాతో బాధపడుతున్నట్లు DM&HO వద్ద నమోదై, సంబంధిత ధ్రువీకరణ పత్రం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
డయాలసిస్ రోగుల పెన్షన్: ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చికిత్స పొందుతున్న వారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా జారీ చేసిన నమోదు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరికి నెలకు రూ.2,016 పెన్షన్ అందుతుంది.
దరఖాస్తుతో సమర్పించాల్సిన పత్రాలు
అర్హత కలిగిన వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ సమర్పించాలి. మైనర్ దివ్యాంగుల విషయంలో సంరక్షకులతో కూడిన జాయింట్ బ్యాంకు ఖాతా అవసరం.
వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల ధ్రువీకరణ పత్రం లేదా ఓటర్ కార్డును సమర్పించాలి. ఆదాయ ధ్రువీకరణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు) లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి. అదేవిధంగా, ఆయా పెన్షన్ కేటగిరీలకు సంబంధించిన ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఆగస్టు 31వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన కోరుట్ల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోగా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ వి. రాఘవేంద్ర కోరారు.
