

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
రాష్ట్రంలోని విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం చైర్‌పర్సన్ స్వీతి అనూప్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనూప్ రావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా జాప్యం చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని పేర్కొంటూ, వాటిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్, మ్యాకల గణేష్, గందే నవీన్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
